Srimad Valmiki Ramayanam

Balakanda Sarga 49

Story of Ahalya ( contd.)!

అఫలస్తు తత శ్సక్రో దేవాన్ అగ్నిపురోధసః |
అబ్రవీత్ త్రస్తవదనః సర్షిసంఘాన్ సచారణాన్ ||

తా|| అప్పుడు వృషణములను కోల్పోయిన ఇంద్రుడు దీనవదనుడై చారణులతోనూ మహర్షులతో కూడియున్న అగ్ని మొదలగు దేవతలతో ఇట్లనెను.

బాలకాండ
నలుబదితొమ్మిదవ సర్గము
( అహల్యా శాప విముక్తి )

విశ్వామిత్రుడు అహల్యా శాపవిమొచనము గురించి చెప్పసాగెను.

'అప్పుడు వృషణములను కోల్పోయిన ఇంద్రుడు దీనవదనుడై చారణులతోనూ మహర్షులతో కూడియున్న అగ్ని మొదలగు దేవతలతో ఇట్లనెను. "క్రోథము తెప్పించి మహాత్ముడైన ఆ గౌతముని తపస్సు భంగపరిచితిని.ఈ దేవతల కార్యము నాచేత చేయబడినది. అయన క్రోథముతో నేను అఫలుడను అయితిని. ఆ అహల్య కూడా ఆకారము లేనిది అయ్యెను. శాప కారణముగా మహత్తరమైన తపోశక్తి నష్టమయ్యెను. ఓ సురవరులారా అందువలన ఋషిసంఘములు చారణులతో కూడి మీరందరూ నన్ను అఫలత్వమునుండి సఫలునిచేయుటకు తగును".

'ఇంద్రుని యొక్క ఆ వచనములను విని అగ్ని మొదలదేవతలు మరుద్గణములతో కూడి పిత్రుదేవతల కడకు వెళ్ళిరి."ఇంద్రునకు వృషణములు లేవు. ఈ మేషమునకు వృషణములు కలవు. ఆ మేషము యొక్క వృషణములు తీసుకొని ఇంద్రునికి ఇవ్వవలెను. మీ ఆనందముకోసము మానవులు దీనిని ఇచ్చున్నారు. మేషమునకు వృషణములు లేనప్పటికి మీకు తృప్తిని ఇచ్చును". అగ్నియొక్క ఆ వచనములను విని అక్కడ సమాగతులైన పిత్రుదేవతలు ఆ మేషముయొక్క వృషణములను తీసి ఇంద్రునికి ఇచ్చిరి.

'ఓ కాకుత్స్థ ! అప్పటి నుండి సమాగతులైన పిత్రుదేవతలు వృషణములు లేని మేషములను భుజించి వారికి ఫలముఅను ఇచ్చుచుండిరి. ఓ రాఘవ !అప్పటినుండి మహత్ముడైన గౌతముని ప్రభావము వలన ఇంద్రుడు మేషవృషణుడు అయ్యెను. ఓ మహాతేజా | అందువలన పుణ్యభుమియగు ఆ ఆశ్రమమునకు రావలయును. దేవరూపిణి మహాభాగా అగు అహల్యను తరింపచేయుడు '.

విశ్వామిత్రుని యొక్క ఆ వచనములను వినిన రాఘవుడు, విశ్వామిత్రుని ముందు ఉంచుకొని ఆ ఆశ్రమము ప్రవేశించెను. లోకులకు సురాసురులకు కూడా కనపడని ఆ తపస్సుచే తనప్రభావముచే వెలుగొందుచున్న ఆ మహాభాగిని ని చూచిరి. దృశ్యా అదృశ్యముగా నీటితో కూడిన మేఘములతో ఆవరింపబడిన పూర్ణ చంద్రుని కాంతివలె సృష్టికర్త చే ప్రయత్న పూర్వకము గా నిర్మింపబడిన ఆమెను చూచిరి. నీటి మధ్యలో వెలుగుచున్న సూర్యుని కాంతివలె నున్నఆమె గౌతమ ముని వచనములచే మూడులోకములకి అదృశ్యముగా నుండెను. రామునియొక్క దర్శనమైన వెంటనే ఆమె శాపము నుంచి విముక్తి పొంది వారికి కనపడెను.

అప్పుడు రామ లక్ష్మణులు ఆమె పాదములను సేవించిరి. అప్పుడు ఆమె కూడా గౌతముని వచనములు స్మరిస్తూ రామలక్ష్మణుల పాదములను సేవించెను. పిమ్మట ఆమె రామలక్ష్మణులకు అర్ఘ్య పాద్యములతో ఆతిథ్యమిచ్చెను. వారు కూడా ఆ కర్మలను విధి విధానముగా స్వీకరించిరి. అప్పుడు మహత్తరమైన పుష్పవృష్టి కురిసెను. గంధర్వులు అప్సరసలు తో దేవతల దుందుభిలతో అ సమాగమము మహత్తరముగా నుండెను.

తపోబలముచే పవిత్రురాలైన , గౌతమునిని చేరిన ఆ ఆహల్యను దేవతలు పూజించి సాధు సాధు అని పొగిడిరి. మహాతేజోవంతుడైన గౌతముడు కూడా ఆహల్యతో సహా రాముని విధివిధముగా పూజించి ఆనందపడి ఆ మహాతపోవంతుడు తపస్సు చేయసాగెను.

రాముడు కూడా శాస్త్రోక్తముగా గౌతమునియొక్క పూజలను స్వీకరించి పిమ్మట మిథిలానగరమునకు బయలు దేరెను.

||ఈ విథముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో బాలకాండ లో నలభై తొమ్మిదవ సర్గ సమాప్తము ||

|| ఓమ్ తత్ సత్||
రామః అపి పరమాం పూజాం గౌతమస్య మహామునేః |
సకాశాద్విధివత్ ప్రాప్య జగామ మిథిలాం తతః ||

తా || రాముడు కూడా శాస్త్రోక్తముగా గౌతమునియొక్క పూజలను స్వీకరించి పిమ్మట మిథిలానగరమునకు బయలు దేరెను.

|| Om tat sat ||